కేరళలో అమానవీయం.. అంధ అధ్యాపకుడిపై విద్యార్థుల వెకిలి చేష్టలు
కేరళలో అమానవీయ ఘటన జరిగింది. గురువు అంధుడని, దివ్యాంగుడని ఆయన చుట్టూ చేరిన కొందరు విద్యార్థులు వెకిలి చేష్టలు చేశారు. అంతటితో ఆగకుండా ఆకతాయి చేష్టలను వీడియోలు తీసి గురువును హేళన చేశారు. ఎర్నాకుళం జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్రం(పొలిటికల్ సైన్స్) బోధించే అధ్యాపకుడి పేరు డాక్టర్ సీయూ ప్రియేష్. అదే కళాశాలలో ఆయనో పూర్వ విద్యార్థి. తాను చదువుకున్న కాలేజీలోనే ఆయన అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఓ తరగతి గదిలో సదరు మాస్టారు క్లాస్ తీసుకుంటున్నారు. దీంతో ఆరుగురు విద్యార్థులు ఆయన చుట్టూ చేరి అల్లరి చేశారు. టీచర్ దృష్టి లోపాన్ని అవహేళన చేస్తూ అమానవీయంగా ప్రవర్తించారు.
గంట క్లాస్ చెప్పేందుకు రెండు గంటల పాటు చదువుకున్నాను : టీచర్
సదరు దృశ్యాలన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో ఈ విషయం అతితక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. విద్యార్థుల పోకడపై విమర్శల పర్వం మొదలైంది. అటు ఇటు వైరల్ గా మారి చివరికి విషయం కళాశాల యాజమాన్యం దృష్టికి వెళ్లింది.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాన ఉపాధ్యాయులు(ప్రిన్సిపాల్) ఘటనకు బాధ్యులుగా ఆరుగురు విద్యార్థులను గుర్తించారు. ఈ మేరకు వారిని సస్పెండ్ చేశారు. తాను గంట బోధన కోసం రెండు గంటలపాటు సన్నద్ధమై తరగతి గదికి వచ్చానని, ఈ మేరకు విద్యార్థులు ఆకతాయిగా ప్రవర్తించారని బాధిత అధ్యాపకుడు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వీడియో చూసిన తన స్నేహితులు, కుటుంబ సభ్యులు మదనపడ్డారని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అంతర్గతంగానే వారితో మాట్లాడి పరిష్కరించుకుంటామన్నారు.