Kerala : కేరళకు 'కేరళం'గా నామకరణం.. ఆసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం
కేరళ పేరును 'కేరళం' గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవం తీర్మానం చేసింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని అధికారిక భాషల్లోనూ కేరళ పేరును కేరళంగా మార్చాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి స్పీకర్ కూడా అమోద ముద్ర వేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని UDF దీనికి మద్దతు ఇచ్చింది. ఇప్పటికే కేరళను మలయాళంలో కేరళంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన భాషల్లోనూ కేరళంగా ఉండాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగంలోని ఒకటో షెడ్యూలులో తమ రాష్ట్రం పేరు కేరళగా ఉందని, ఆర్టికల్ 3 ప్రకారం దాన్ని కేరళంగా సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పినరయి విజయన్ కోరారు.
1956 నవంబర్ 1న ఏర్పడిన కేరళ
కేరళను కేరళంగా అధికారికంగా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇంగ్లిష్ డాక్యుమెంట్‌లలో కేరళ పేరును కేరళం గా మార్చాలని సీపీఎం ఎమ్మెల్యే ఎంఎం మణి 2016లో అసెంబ్లీలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై సీఎం విజయన్ అలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని సూచించారు. 2017లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారిక భాషగా మలయాళాన్ని గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్లు, లేఖలు అన్నీ మలయాళంలోనే జారీ చేస్తుండడం విశేషం. భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనలో భాగంగా 1956 నవంబర్ 1న కేరళ ఏర్పడిన విషయం తెలిసిందే.