కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట
దేశంలోనే తొలిసారిగా కేరళకు చెందిన ఓ ట్రాన్స్ మన్ తల్లి కాబోతోంది. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న జహాద్, జియా పావల్ తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. మార్చిలో జహ్హాద్ తమ బిడ్డను ప్రసవించనున్నట్లు జియా పావల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. టాన్స్‌జెండర్ జంట తల్లిదండ్రులు కోబోతుండటం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిపోయాడు. వారిద్దరూ తాము టాన్స్‌జెండర్స్ అని తెలుసుకున్న తర్వాత తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. అనంతరం వీరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వీరు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
ఇతర ట్రాన్స్‌జెండర్ల కంటే భిన్నంగా జీవించాలని అనుకున్నాం: జియా పావల్
తల్లిదండ్రులు కాబోతున్న సందర్భంలో జియా పావల్ తమ అనూభూతిని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తల్లి కావాలనే తన స్వప్నాన్ని, తండ్రి కావాలనే అతని కలను సాకారం చేసుకోబోతున్నట్లు పావల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. జహాద్ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి అని జియా చెప్పారు. తాను పుట్టుకతో స్త్రీని కానప్పటికీ, ఒక శిశువు తనను 'అమ్మా' అని పిలవడం వినాలని కలలు కంటున్నట్లు వెల్లడించారు. మూడేళ్లక్రితం కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు తమ జీవితం ఇతర ట్రాన్స్‌జెండర్ల కంటే భిన్నంగా ఉండాలని అనుకున్నట్లు జియా పేర్కొన్నారు. చాలా మంది లింగమార్పిడి జంటలను సమాజంతో పాటు వారి కుటుంబాలు బహిష్కరించాయని, తాము చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఉండాలన్న ఉద్దేశంతోనే బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్నట్లు జియా చెప్పారు.