Amaravati: అమరావతి అభివృద్ధి దిశగా కీలక ఆమోదం.. రూ.15వేల కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్
అమరావతి నగర నిర్మాణం, సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణ సహకారం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి వినియోగించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించుకుంది. రాష్ట్ర రహదారులు, కాలువలు, నీటి రిజర్వాయర్‌లు, తాగునీటి వసతులు వంటి మౌలిక ప్రాజెక్టులు చేపట్టాలని సీఆర్‌డీఏకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ బ్యాంకు, అసియా అభివృద్ధి బ్యాంకుల అనుమతి
ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించగా, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా అందుకు అనుమతినిచ్చాయి. ఈ నిధులతో అమరావతిలో నిర్మాణ ప్రణాళికలు దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరమైన అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేక ఖాతా ఏర్పాటును కూడా చేపట్టనున్నారు. ఇక ఆర్థిక సహకారం కోసం సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ రేపు దిల్లీలో వరల్డ్ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఈ అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలను సీఆర్‌డీఏ కమిషనర్ ఆధ్వర్యంలో అమలు చేయనున్నట్టు మంత్రి అనంత రాము వెల్లడించారు.