లోక్‌సభలో మూడు కీలక బిల్లులకు ఆమోదం.. గనులు, ఖనిజాల సవరణ 2023 బిల్లుకు గ్రీన్ సిగ్నల్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కీలక బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. ద నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమీషన్ బిల్లు 2023, ద నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు సభలో పాసైంది. మరోవైపు గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లు 2023ని లోక్‌సభలో ఆమోదించారు. మూజువాణి ఓటు ద్వారా బిల్లు పాసైనట్లు ప్రకటించారు. (Mines and Minerals Amendment Bill) 2023కి దిగువసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కారణంగా సదరు బిల్లు గేమ్ ఛేంజర్ కానున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వన్ బిలియన్ టన్నుల బొగ్గును దేశీయంగా ఉత్పత్తి చేయనున్నట్లు జోషి సభ ద్వారా స్పష్టం చేశారు.
విపక్ష ఎంపీల నిరసనతో సోమవారానికి సభ వాయిదా
భారతదేశంలో బొగ్గును వెలికితీసే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేట్ సంస్థలకు బొగ్గు గనుల కేటాయింపులో భాగంగా తమ ప్రభుత్వం పారదర్శక విధానం పాటిస్తోందని కేంద్రమంత్రి జోషి చెప్పుకొచ్చారు. మైనింగ్ బిల్లు ద్వారా గనుల లీజు విషయంలో కేంద్రానికి మరిన్ని అధికారాలు సమకూరుతాయని జోషి అన్నారు. గనులు, ఖనిజాల బిల్లుతో తమ ప్రభుత్వం చేపట్టిన సవరణలతో బొగ్గును స్వదేశంలో ఉత్పత్తి చేసి భారత్ ను సుస్థిరం చేస్తామన్నారు. 2025-06 నాటికి విదేశాల నుంచి అన్ని రకాల బొగ్గు దిగుమతులను నిలిపేయనున్నట్లు మంత్రి జోషి వివరించారు. ఒక దశలో మంత్రి ప్రహ్లాద్ జోషి కోల్ పాలసీని వివరిస్తుండగా, విపక్షాలు మణిపూర్ అంశంపై పెద్ద ఎత్తున నినదించాయి. విపక్ష ఎంపీల నిరసనతో సభను సోమవారానికి వాయిదా పడింది.