Page Loader
Chandrababu: చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్‌ యాక్షన్‌ బృందాలు
చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్‌ యాక్షన్‌ బృందాలు

Chandrababu: చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్‌ యాక్షన్‌ బృందాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతా నిర్వహణలో కొత్తగా కౌంటర్‌ యాక్షన్‌ బృందాలు చేరికయ్యాయి. మావోయిస్టుల నుంచి ముప్పు ఉందనే నేపథ్యంలో, ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ)లో ఇటీవల కొన్ని మార్పులు చేశారు. బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు, ఎస్‌ఎస్‌జీ సిబ్బందికి అదనంగా, ఈ కౌంటర్‌ యాక్షన్‌ బృందాలు కూడా భద్రతా బాధ్యతలు నిర్వహించనున్నాయి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ముఖ్యమంత్రి రక్షణ విషయంలో రాజీ పడకుండా, ఈ బృందంలో ఆరుగురు కమాండోలు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడతారు.

వివరాలు 

 ఆరుగురు కౌంటర్‌ యాక్షన్‌ కమాండోలు చంద్రబాబుకు నిరంతరం దగ్గరగా.. 

మూడు స్థాయిల భద్రతా వ్యవస్థలో చంద్రబాబుకు తొలి వలయంగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు,రెండో వలయంగా ఎస్‌ఎస్‌జీ సిబ్బంది,ఆయన పర్యటించే ప్రాంతాల్లోని స్థానిక సాయుధ బలగాలు మూడో వలయంగా భద్రత కల్పిస్తాయి. వీరితో పాటు ఆరుగురు కౌంటర్‌ యాక్షన్‌ కమాండోలు చంద్రబాబుకు నిరంతరం దగ్గరగా ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో మొదటి రెండు వలయాల సిబ్బంది ముఖ్యమంత్రిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తే,కౌంటర్‌ యాక్షన్‌ టీమ్‌ బయటి నుంచి వచ్చే దాడులను సమర్థంగా ఎదుర్కొంటుంది. ప్రత్యేక శిక్షణ పొందిన ఈ కమాండోలు ప్రధానమంత్రి భద్రతా నిర్వహణలో ఉపయోగించే ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌)శిక్షణను అందుకున్నారు. వీరికి ప్రత్యేకంగా నలుపు రంగు చొక్కాలు,ముదురు గోధుమ రంగు ప్యాంట్లు ఉంటాయి.చొక్కాల ముందు, వెనుక "ఎస్‌ఎస్‌జీ"అనే ఆంగ్ల అక్షరాలు కనిపించేలా రూపొందించారు.