Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయించారు. దేశ రైతాంగానికి మేలుచేసే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం రూ. 13,966 కోట్ల భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైతుల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి కేంద్రం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ మిషన్‌కు రూ. 2,817 కోట్లు కేటాయించారు. భవిష్యత్తులో రైతులు బ్యాంకు లోన్‌లు కేవలం 20 నిమిషాల్లో పొందేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు.
కృషి విజ్ఞాన్ కేంద్రాల అభివృద్ధికి రూ. 1,202 కోట్లు
ఆహార భద్రత, పోషకాహారం భద్రత కోసం ప్రభుత్వం రూ. 3,979 కోట్ల నిధులను కేటాయించింది. అలాగే, పశువుల ఆరోగ్యం, డైరీ ఉత్పత్తుల అభివృద్ధికి రూ. 1,702 కోట్లు, హార్టికల్చర్ రంగం కోసం రూ. 860 కోట్లు, కృషి విజ్ఞాన్ కేంద్రాల అభివృద్ధికి రూ. 1,202 కోట్లు నిధులిస్తామని తెలిపారు. నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం రూ. 1,115 కోట్లు కేటాయించగా, 39 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ. 18,036 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మన్మార్-ఇండోర్ రహదారి ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.