
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త క్రీడా విధానానికి మంత్రివర్గం ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తూ, కొత్త క్రీడా విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి తో పాటు,క్రీడాకారుల సమగ్ర పురోగతికి దిశానిర్దేశకంగా నిలవనుంది. ఇందులో భాగంగా పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించే "రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్" స్కీమ్‌కు కేంద్రం ఆమోదం ఇచ్చింది. ఈ పథకానికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి (కార్పస్ ఫండ్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయివేటు రంగం నుంచి పరిశోధన రంగానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, దీర్ఘకాలికంగా వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని నిర్ణయించడమైంది.
వివరాలు
ఉపాధి అవకాశాల కోసం రూ.1.07 లక్షల కోట్లు
ఉపాధి అవకాశాలను పెంచేందుకు రూ.1.07 లక్షల కోట్లు కేటాయించారు. ఈ నిధులను ఉపయోగించి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాక, తమిళనాడు రాష్ట్రంలోని పరమకుడి-రామనాథపురం జాతీయ రహదారి అభివృద్ధి కోసం రూ.1853 కోట్లను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.