
Supreme court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు.. తీర్పు రిజర్వు
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగించగా, తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, కౌశిక్‌రెడ్డి తరఫున న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు.
అన్ని వాదనలు పూర్తయ్యాక, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.
Details
సుప్రీంకోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు
గురువారం విచారణలో తొలుత అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ, మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఎంత? అని ప్రశ్నించారు.
ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావు.. స్పీకర్ తరఫున కూడా చెబుతున్నా అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై జస్టిస్ గవాయ్ సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది, ఇప్పుడు మళ్లీ అదే జరగడం సరైనదేనా? అని ప్రశ్నించారు.
Details
ప్రతిపక్షం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది
అంతేగాక, అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. కోర్టు ధిక్కారం కింద సీఎం వ్యాఖ్యలను పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.
మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవాన్ని పాటించాలని హితవు పలికారు.
స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో ఈ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించడం సరైనది కాదని అభిషేక్ మనుసింఘ్వీ వాదించగా, సింగిల్ జడ్జి సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే ఈ కేసు ఇక్కడి వరకు రాలేదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
చివరగా, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.