
Killers Of Pahalgam: పహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల చేసిన ఏజెన్సీలు..!
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు తీవ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు బుధవారం విడుదల చేశాయి.
అధికారుల ప్రకారం,వారిలో ముగ్గురి పేర్లు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.
వీరికి మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్ నేమ్‌లు ఉన్నట్లు పీటీఐ నివేదించింది.
ఈ ముగ్గురు 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారని గుర్తించారు. ఈ సంస్థ జమ్మూకశ్మీర్ కేంద్రంగా పని చేస్తోంది.
వివరాలు
ఉగ్రవాదుల కోసం భారీ స్థాయిలో గాలింపు చర్యలు
ఈ చిత్రాలను ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ప్రత్యక్ష సాక్షుల వర్ణనల ఆధారంగా రూపొందించారు.
దాడి సమయంలో ఉగ్రవాదులు పురుషులను ప్రత్యేకంగా వేరు చేసి వారి గుర్తింపులను తనిఖీ చేస్తున్న సమయంలో, బాధితులు వారి ముఖాలను గమనించినట్లు తెలిసింది.
ఈ కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అదే విధంగా, ఓ ఉగ్రవాది ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న ఫొటోను కూడా భద్రతా సంస్థలు విడుదల చేసింది.
వివరాలు
బైసరన్ లోయను లక్ష్యంగా ఎంచుకున్న ఉగ్రవాదులు
పర్యాటకులపై దాడికి బైసరన్ లోయను ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఎక్కువమంది పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని,మరణాల సంఖ్యను పెంచేందుకు వీరు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారని భావిస్తున్నారు.
బైసరన్ లోయ ప్రాంతంలో భద్రతా చర్యలు తక్కువగా ఉండడాన్ని వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.
పహల్గాం నుంచి ఈలోయకు చేరాలంటే సుమారు 6.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది.
ఇది సాధ్యపడేది కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే దీనివల్ల భద్రతా బలగాల రాక ఆలస్యం అవుతుంది,సహాయక చర్యలు కూడా ఆలస్యమవుతాయి.
ఈ ప్రాంతం చుట్టూ గాఢమైన అటవీ ప్రాంతం ఉండటంతో,అలాగే మంచు కురుస్తుండడంతో ఉగ్రవాదులు ఈ ప్రాంతం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.
అలాంటి పరిస్థితుల్లో సైన్యం గాలింపు చర్యలు చేపట్టినా,ముష్కరులను వెంటనే గుర్తించడం కష్టం అవుతుంది.
వివరాలు
దాడిని బాడీ కెమెరాల్లో చిత్రీకరించిన ఉగ్రవాదులు
ఈ దాడి మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ప్రారంభమైంది.
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం, ముష్కరులు దాడిని బాడీ కెమెరాల సహాయంతో వీడియో రికార్డు చేశారు.
ఈ కెమెరాలను హెల్మెట్లకు అమర్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఉగ్రవాదులు ముందుగా బాధితులందరినీ ఒకచోటకు చేర్చారు. ఆపై వారి గుర్తింపులను సేకరించడంతోపాటు వారిపై దాడి చేశారు.
కొంతమందిని దగ్గరగా కాల్చగా, మరికొంతమందిపై దూరం నుంచి స్నైపర్ లాంటి ఆధునిక టెక్నిక్స్‌ను ఉపయోగించి కాల్పులు జరిపారు.
ఈ దాడి మానవతావాదాన్ని మంటగలిపే దారుణ ఘటనగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది.