NEET UG Leak : పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్‌షీట్.. 13మంది నిందితులపై అభియోగాలు
అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 అంశం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పటికీ విచారణ సాగుతోంది. నీట్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై సీబీఐ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్థులు, ఓ జూనియర్ ఇంజినీర్, ఇద్దరు కుట్రదారులు సహా 13 మందిని నిందితులుగా తేల్చింది.
నీట్ పరీక్షా
ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టును పలువురు కోరగా, అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నీట్ లీక్ అయిందని, అయితే దాని ప్రభావమే స్వల్పమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బిహార్‌కు చెందిన నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్‌లతో పాటు విద్యార్థులు ఆయుష్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివేంద్ర కుమార్, దనాపూర్‌కు చెందిన జూనియర్ ఇంజినీర్ సికిందర్ యాదవేందులు పేర్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. మొత్తం 13 మంది నిందితులపై నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రధాన నిందితుడిగా నితీష్ కుమార్
పాట్నాలోని గోపాల్‌పూర్ కు చెందిన నితీష్ కుమార్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. అమిత్ ఆనంద్, యాద్వెందుతో కలిసి ఒక్కో విద్యార్థికి రూ. 30-32 లక్షల చొప్పున అమ్మినట్లు తెలిసింది. నీట్ పరీక్షకు ముందు రోజు మే4న రాత్రి నలుగురు విద్యార్థులను అమిత్ పిలిపించి, లీకైన ప్రశ్నపత్రం సాల్వ్ చేసి సమాధానాలను గుర్తుపెట్టుకొనేలా వారిని బట్టిపట్టించారు. ఈ ఘటనపై 58 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇప్పటి వరకూ 40 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది.