KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి
KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి మీ నియోజకవర్గ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అలాగే వారి ఆస్తులు, అప్పుల గురించి మీకు సమాచారం కావాలా? ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియజేసేందుకు భారత ఎన్నికల సంఘం 'నో యువర్ కాండిడేట్ (Know Your Candidate- (KYC)' పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో 'కేవైసీ' యాప్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కేవైసీ యాప్ అనేది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థికి నేర నేపథ్యం ఉందో లేదో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు.
వారికి ఎందుకు టికెట్ ఇస్తున్నారో చెప్పాలి: ఈసీఐ
KYC యాప్‌లో అభ్యర్థికి సంబంధించిన ఆస్తులు, అప్పులను ఓటర్లు తెలుసుకోవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు. అలాగే, నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను నిలబెట్టే పార్టీలకు కూడా ఈసీఐ కీలక సూచనలు చేసింది. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు ఎందుకు టికెట్ ఇస్తున్నారో ఎన్నికల సంఘానికి వివరించాల్సి ఉంటుందని కమిషనర్ వెల్లడించారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థి ఎంపిక ఏ ప్రాతిపాదిన చేశారన్న స్పష్టమైన అవగాహనతో తమతో పంచుకోవాలని సూచించింది. ఈ వివరాలను అన్ని కేవైసీ యాప్‌లో అందుబాటులో ఉంచి, పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. కైవేసీ యాప్ Google Play Store, Apple App Store రెండింటిలోనూ అందుబాటులో ఉంది.