Kolkata case:విధుల్లో చేరేందుకు నిరాకరించిన కోల్‌కతా వైద్యులు.. సీఎంతో మరోసారి చర్చలు కావాలి
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపిన వైద్యులు తమ నిరసనలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు సీఎంతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. బాధితురాలికి పూర్తిగా న్యాయం జరిగేంతవరకు తమ నిరసనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఆరోగ్య కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం నుంచి రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలు కొనసాగిస్తున్నాయి. '
ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులకు భద్రత
'మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేంతవరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. కోల్‌కతా ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్‌ఎస్ నిగమ్‌ను విధుల నుంచి తొలగించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం అత్యవసరం. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు సీఎంతో మరోసారి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది'' అని వైద్యులు తెలిపారు. సీఎం మమతాతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్‌కు మెయిల్ పంపినట్లు వారు వెల్లడించారు. ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులకు భద్రత కల్పించడమే కాకుండా, ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను ఎలా ఖర్చు చేయాలనే అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రాజకీయ విమర్శలను తెరపైకి తెచ్చింది. ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వైద్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. వైద్య విద్యార్థుల ఐదు డిమాండ్లలో మూడు డిమాండ్లను దీదీ అంగీకరించింది. ఆందోళనకారుల డిమాండ్ మేరకు కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. ఈ క్రమంలో, నూతన కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమిస్తూ దీదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మరోసారి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని నిరసనకారులు అభ్యర్థిస్తున్నారు.