Kolkata: 'నబన్న అభిజన్' పేరుతో విద్యార్థి సంఘాల నిరసన.. 6వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో కలకలం కొనసాగుతోంది. మొదట వైద్యులు, ఇప్పుడు విద్యార్థి సంఘం నిరసనలు తెలుపుతున్నాయి. విద్యార్థి సంఘం నేడు 'నబన్న అభిజన్' కవాతుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. నబన్నో రాష్ట్ర సచివాలయం అని, ఇక్కడ నుండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. నబన్నోలోనే మమతా బెనర్జీ,ఇతర మంత్రులు, అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు
నబన్న నిరసన దృష్ట్యా కోల్‌కతా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం నగరంలో 6000 మందికి పైగా పోలీసులను మోహరించారు. ఇది కాకుండా 19 పాయింట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రదేశాల్లో 5 అల్యూమినియం బారికేడ్లను ఏర్పాటు చేశారు. నబన్న భవన్ వెలుపల మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పర్యవేక్షిస్తారు. నబన్న భవన్ చుట్టూ 160 మందికి పైగా డీసీఆర్‌ఎఫ్ సిబ్బందిని మోహరించారు.