Kolkata rape-murder: సుప్రీం గడువు ముగిసినప్పటికీ.. కొనసాగుతోన్న జూనియర్ డాక్టర్ల ఆందోళనలు
వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా ఆందోళనల చేస్తున్న డాక్టర్లు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లోకి చేరాలని డాక్టర్లకు సుప్రీంకోర్టు సోమవారం గట్టిగా హెచ్చరించింది, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. అయితే, నిరసనలో ఉన్న వైద్యులు తమ ఆందోళనలు విరమించబోమని స్పష్టం చేశారు. వైద్యులు ఇది ప్రజా ఉద్యమమని, ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని అనుసంధానం చేసుకోవాలని సూచించారు. సోమవారం నాటి సుప్రీంకోర్టు విచారణ తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని వైద్యుల ప్రతినిధి తెలిపారు.
సుప్రీంకోర్టు విచారణ మమ్మల్ని నిరాశపరిచింది
"సుప్రీంకోర్టు విచారణ మమ్మల్ని నిరాశపరిచింది. కేసు హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు, రాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయబడింది, కానీ ఇప్పటికీ న్యాయం జరగలేదు," అని ఆర్జీ కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ల ప్రతినిధి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందనే వాదనను డాక్టర్లు తిరస్కరించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆగస్టు 9 నుంచి 23 మంది రోగులు వైద్యుల నిరసన కారణంగా మరణించారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (బెంగాల్ విభాగం) జూనియర్ వైద్యులకు సంపూర్ణ మద్దతు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (బెంగాల్ విభాగం) జూనియర్ వైద్యులకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించింది. కోర్టు,సీబీఐ చర్యల వల్ల తాము పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యామని, వైద్యురాలికి న్యాయం చేయడానికి తగిన చర్యలు తీసుకోలేదని ఆందోళనలో ఉన్న వైద్యులు విమర్శించారు. జూనియర్ వైద్యుల నిరసనల వల్ల ఆసుపత్రుల్లో సేవలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పడాన్ని వారు ఖండించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం "విధులను విస్మరించి నిరసనలు చేయడం సరికాదు," అని హెచ్చరించింది. వైద్యులు తక్షణమే విధుల్లోకి చేరాలని, విధుల్లో చేరితే వారిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని, కానీ నిరసనలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.