AP Rains: కోనసీమ జిల్లాలో గోదారి ఉధృతి.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో వైనతేయ, వశిష్ఠ, గౌతమి, వృద్ధ గౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రభావంతో కనకాయలంక, ముక్తేశ్వరం, అప్పనపల్లి కాజ్‌వే మునిగిపోయాయి. పడవలపై లంక గ్రామాల ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఏనుగుపల్లి, తొగరపాయ వద్ద పడవల ద్వారా లంక గ్రామాల ప్రజలు బయటకు వస్తున్నారు. కోనసీమకు రెండోసారి వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా పర్యటించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వరదలపై అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు.
చాకలిపాలెం - కనకాయలంక కాజ్వే పై వరద ఉధృతి
మరోవైపు, జిల్లాలోని రాజోలు దీవిలో గంటకు గంట వరద ఉధృతి పెరుగుతోంది. పాశర్లపూడి - అప్పనపల్లి కాజ్వే పై వరద నీరు చేరటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. చాకలిపాలెం - కనకాయలంక కాజ్వే పై వరద ఉధృతి పెరగడంతో లంకవాసులు పడవలపై ప్రయాణిస్తున్నారు. టేకు శెట్టిపాలెం - అప్పనరాముని లంక కాజ్వే మునిగిపోవడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు ఆర్డీవో.
వరద ప్రభావిత ప్రాంతాల్లో.. అమలాపురం ఎంపి,ఎమ్యెల్యే
ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అమలాపురం ఎంపి గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వరద ముంపుకు గురైన ఇళ్ళు, పంటపొలాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరదలతో నదీ కోతకు గురైన లంక గ్రామాల పరిరక్షణకు ఇప్పటికే 252 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నుండి పెద్ద ఎత్తున నిధులు సేకరించి లంక గ్రామాలను పరిరక్షిస్తామన్నారు.