'one nation, one election': జమిలీ ఎన్నికలతో కేంద్రానికి మేలు: మాజీ రాష్ట్రపతి కోవింద్
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (one nation, one election)పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ చీఫ్‌గా ఉన్న విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని, నిధులు ఆదా అవుతాయని, తద్వారా ఎవరు అధికారంలో ఉన్నా.. కేంద్రానికి మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ నిధులను ఆదా చేసి, అభివృద్ధి పనులకు వినియోగించవచ్చన్నారు.
జాతీయ పార్టీల నుంచి సూచలను కోరా: కోవింద్
జమిలీ ఎన్నికలపై తాను అన్ని జాతీయ పార్టీలతో మాట్లాడానని, ఏకకాలంలో ఎలక్షన్లు నిర్వహించడంపై వారి సూచనలను కూడా కోరినట్లు రామ్‌నాథ్ చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సమయంలో జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా, కేవలం జాతీయ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ జమిలీ ఎన్నికలకు మద్దతుగా నిలవాలని కోవింద్ ఆకాంక్షించారు. ఇందులో ఎలాంటి వివక్ష లేదని, సామాన్య ప్రజానీకానికి అత్యధిక ప్రయోజనం చేకూరుతుందని, జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల మిగిలే ఆదాయాన్ని అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని సెప్టెంబర్ 2న ప్రభుత్వం ఏర్పాటు చేసింది.