
కృష్ణా ట్రిబ్యునల్‌లో ఏపీ సర్కారుకు షాక్.. నీరు వాడకుండా తెలంగాణను అడ్డుకోలేమని స్పష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను KWDT(KRISHNA WATER DISPUTES TRIBUNAL) ట్రెబ్యునల్ తిరస్కరించింది.
తెలంగాణ 90 టీఎంసీల నీటిని వాడుకోకుండా నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు KWDTని ఆశ్రయించింది.
ఈ మేరకు స్పందించిన ట్రిబ్యూనల్, దీన్ని విచారించే అధికారం తమకు లేదని, అలాగే 90 టీఎంసీల కృష్ణా నీటిని తెలంగాణ ప్రభుత్వం వాడుకోకుండా అడ్డుకోలేమని స్పష్టం చేసింది.
ఇందుకు తగిన వేదికలను ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచనలు చేసింది.గత డిసెంబర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది.
DETAILS
90 టీఎంసీల నీటి తరలింపు కోసం 5 ఎత్తిపోతలు, 6 జలాశయాలు రెడి
తెలంగాణ 90 టీఎంసీల నీటిని వినియోగించకుండా ఆపాలని ఏపీ పట్టుబట్టింది.
చిన్ననీటి పారుదల వినియోగం ప్రకారం 45 టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో మరో 45 టీఎంసీలను తెలంగాణ కేటాయించింది.
మొత్తంగా 90 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కట్టబెడుతూ తెలంగాణ నిర్ణయం తీసుకుంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్, నార్లాపూర్ వద్ద తొలిదశ ఎత్తిపోతలను మొదలుపెట్టారు.
శ్రీశైలం వెనుక ఉన్న నీటి ఆధారంగా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీరును తరలించేలా ఈ ప్రాజెక్టుని సిద్ధం చేశారు.
60 రోజుల్లోనే 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 5 ఎత్తిపోతలు, 6 జలాశయాలను నిర్మించారు.