LOADING...
Krishna River: ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు 
ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు

Krishna River: ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అధికారులు మధ్యాహ్నం లోపే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం బ్యారేజీకి 3.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా,అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు, సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో లంక ప్రాంత గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించింది.

వివరాలు 

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 30 వేల క్యూసెక్కులు విడుదల

ఇక, జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి కూడా వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 3,38,218 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 4,00,158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 30 వేల క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,153 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, 10 స్పిల్‌వే గేట్ల ద్వారా 3,04,690 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం అది 881.70 అడుగులకు చేరింది.

వివరాలు 

ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10.5 అడుగులు

అంతేకాక, గోదావరిలోనూ వరద ప్రవాహం తీవ్రత పెరిగింది. రాజమహేంద్రవరం వద్ద నది ఆగ్రహంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10.5 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం డెల్టా కాల్వలకు 2,100 క్యూసెక్కుల నీటిని పంపిస్తుండగా, సముద్రంలోకి 8.23 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.