Andhra Pradesh: స్వర్ణాంధ్ర-2047 దిశగా కృషి రోడ్ మ్యాప్ అమలు
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో మరో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులు అమలు చేస్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌లో బుధవారం 'కృషి రోడ్ మ్యాప్'పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌కుమార్ అగర్వాల్, ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఉద్యాన) డాక్టర్ సంజయ్‌కుమార్ సింగ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులు హాజరయ్యారు.
వివరాలు
కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం
స్థూల విలువ జోడింపులో 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల వివరాలను రాజశేఖర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర అధికారులకు వివరించారు. స్వర్ణాంధ్ర-2047 విజన్లో భాగంగా రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం చేసేలా కృషి రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సంయుక్త కార్యదర్శి సంజయ్‌కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు. విలువ ఆధారిత పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర బృందం గురువారం ఏలూరు జిల్లాలో పర్యటించనుంది.