KTR: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ పోరుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో చేవెళ్ల నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని, అందుకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాయమని నిరాశపడకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకుసాగాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని కాపాడుకుంటూనే.. ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో నాయకులను సిద్ధం చేయాలి: కేటీఆర్
పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా మీటింగ్‌లను నిర్వహించుకొని.. క్షేత్రస్థాయిలో నాయకులను సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలే నియోజకవర్గాలకు ఇంచార్జిలుగా ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ పోరులో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,09,000 మెజార్టీ బీఆర్ఎస్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మెజార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని దాదాపు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. రంజిత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తనను చేవెళ్ల ఎంపీగా చేయాలని కేటీఆర్ అడిగినట్లు రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.