#NewsBytesExplainer: ఏపీలో టీడీపీ,జనసేన మధ్య సమన్వయ లోపం.. అసలు ఏం జరుగుతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్య పరిస్థితులు అంత అనుకూలంగా లేవని స్పష్టంగా కనిపిస్తోంది. పరస్పర సమన్వయం పూర్తిగా కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల పరంగానే కాదు, పాలన వ్యవహారాల్లో కూడా అదే లోపం కనబడుతోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఈగోలకు పోతున్నారో... ఓ పార్టీ ఎక్కువగా బెండ్ అయిపోతోందన్న భావనో కానీ .. దీనివల్ల .. అనే పరిణామాలకు కారణం అవుతున్నాయి. అందుకే కూటమిపార్టీలు అత్యవసరంగా ఇప్పుడు తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా చూసుకుని, అంతర్గత విభేదాలను,పరిస్థితుల్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
సమన్వయలోపం
ఇతర శాఖల్లో పవన్ జోక్యం - సమన్వయలోపం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోంశాఖ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక డీఎస్పీ స్థాయి అధికారి విషయంలో ఆయన నేరుగా ఎస్పీతో మాట్లాడటం తప్పేమీ కాదు. అవసరమైతే ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లి,అధికారిని బదిలీ చేయించుకోవచ్చు. అయితే,ఈ తరహా అంశాలు బయటకు రావడం సరైనది కాదు.ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగంలో అంతర్గతంగా పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని.. దానిపై నివేదిక కావాలని డీజీపీని అడిగినట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి విషయాలు జనసేన లేదా డిప్యూటీ సీఎం అధికారిక హ్యాండిల్స్ ద్వారా బయటకు రావడం వల్ల సంబంధిత మంత్రికి అవమానంగా మారుతోంది. ఈఅంశం కూటమి లోపల అవగాహన లోపాన్ని సూచిస్తోంది.
వివరాలు
పార్టీ పరంగానూ కోఆర్డినేషన్ కరువు
ప్రతి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని సమన్వయంతో ఎదుర్కోవడం అత్యవసరం. పార్టీ పరంగానూ రెండు పార్టీల మధ్య కోఆర్డినేషన్ కరవు అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి అంటే.. ఓ లీడర్ బలంగా ఉన్నాడని అతన్ని జీరో చేసి ఇతర పార్టీకి మేలు చేయడం కాదు. అన్ని పార్టీలు సమాన బలంతో ఉండాలి. ఎవరో ఒక పార్టీ బలహీనమైతే కూటమి మొత్తం దెబ్బతింటుంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు, లాభాల కోసం కొంతమంది కార్యకర్తలు ఇతర పార్టీలపై ఒత్తిడి తీసుకురావడం వంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ రకమైన అంశాలను రెండు పార్టీలు సమయానికి నియంత్రించుకోవాలి. ఒక పార్టీపై మరొకటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగితే విశ్వసనీయత కోల్పోతుంది.
వివరాలు
పాలనే కాదు.. పార్టీలపైనా దృష్టి పెట్టాల్సిన సమయం!
పైస్థాయిలో ఉన్న నాయకుల మధ్య అవగాహన మాత్రమే కాకుండా, అది క్రింది స్థాయి వరకూ చేరుకునేలా సమన్వయం అవసరమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ప్రధాన నాయకులు పూర్తిగా పాలనపైనే దృష్టి సారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ కలిసి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. నవంబర్‌లో జరగబోయే సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, పెట్టుబడులు సాధించడం వంటి కార్యక్రమాలతో పాటు కూటమి భాగస్వామ్యాల మధ్య సమన్వయం బలపరచడం కూడా తక్షణ అవసరం. లేకపోతే కూటమి ఆత్మ, ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.