మోదీపై లాలూ చురకలు.. ప్రధాని ఎవరైనా సరే భార్య లేకుండా ఉండకూడదని హితవు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఐక్య రాగం వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాబోయే భారతదేశం ప్రధాని కచ్చితంగా భార్య లేనివాడు కాకూడదంటూ కామెంట్స్ చేశారు. ప్రధానిగా ఎవరైనా సరే వారికి కచ్చితంగా భార్య ఉండాలని పాత్రికేయుల సమావేశంలో లాలూ అన్నారు. భార్య లేకుండా ప్రధాని నివాసం ఉండటం మంచికాదని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నియమావళిని తప్పకూడదని హితవు పలికారు.
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు 300 సీట్లకు పైగా వస్తాయి : లాలూ
అంతకుముందు, వివాహం చేసుకోవాలంటూ రాహుల్ గాంధీకి, లాలూ ప్రసాద్ సూచనలు చేశారు. అయితే ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా కొనసాగుతోంది. ఈ కూటమి నుంచి రాహుల్ గాంధీనే ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని ఎవరైనా భార్య లేనివారుగా ఉండకూడదని అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కనీసం 300 సీట్లకు తగ్గకుండా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే భోపాల్ సభలో మోదీ చేసిన కామెంట్స్ పట్ల లాలూ స్పందించారు. ఏ అవినీతి నాయకుడిని మోదీ వదలబోమంటున్నారని, కానీ అవినీతి రాజకీయాలకు మోదీయే కన్వీనర్ అని చురకలు అంటించారు. ఇందుకు మహారాష్ట్ర విభజన రాజకీయాలే ఉదాహరణగా పేర్కొన్నారు.