LOADING...
Sikkim: సిక్కింలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు.. ముగ్గురు జవాన్ల మృతి
సిక్కింలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు.. ముగ్గురు జవాన్ల మృతి

Sikkim: సిక్కింలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు.. ముగ్గురు జవాన్ల మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఛటేన్‌ ప్రాంతంలోని మిలిటరీ క్యాంప్‌పై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలను ఇప్పటికే గుర్తించామని రక్షణశాఖ అధికారులు సోమవారం ధృవీకరించారు. మరో నలుగురు సురక్షితంగా బయటపడగా, గల్లంతైన వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Details

ఈశాన్య రాష్ట్రాలకు రెడ్‌అలర్ట్‌

భారీ వర్షాలు ఈశాన్య భారతాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఈ ప్రాంతాలకు రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. అస్సాం, మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, మిజోరాం, నాగాల్యాండ్‌, మేఘాలయల్లో ఇవాళ కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌తో పాటు జమ్మూ కశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్‌లలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Details

వర్షాల వెనక కారణాలేంటి?

నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడం, బంగ్లాదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడటం వలన ఈశాన్య ప్రాంతాల్లో విపరీత వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అస్సాంలో పరిస్థితి విషమం అస్సాంలో వరదలు తీవ్రంగా అదుపుతప్పాయి. ఆదివారం నాటికి రాష్ట్రంలోని 7 ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 20కి పైగా జిల్లాల్లో వరదలు మిగిలిన జనజీవనాన్ని స్తంభింపజేశాయి. సుమారు 4 లక్షల మంది ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గువాహటిలో శనివారం ఒక్క రోజులోనే 11 సెం.మీ.ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది గత 67 ఏళ్లలో మే నెలలో నమోదైన అత్యధిక వర్షపాతంగా నమోదైంది.

Details

త్రిపురలో భారీ నష్టం

త్రిపుర రాజధాని అగర్తలలో ఎడతెగని వర్షాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. ఓ వ్యక్తి వర్షపు నీటిలో మాయమైన మ్యాన్‌హోల్‌లో పడి మరణించాడు. కేవలం మూడు గంటల వ్యవధిలోనే 20 సెం.మీ.ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.