
Koheda: కొహెడలో అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణానికి రంగం సిద్ధం.. 199 ఎకరాలు.. రూ.1,901 కోట్లు..
ఈ వార్తాకథనం ఏంటి
అత్యాధునిక సౌకర్యాలతో,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా,దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ శివార్లలోని కొహెడలో 199.12ఎకరాల విస్తీర్ణంలో రూ.1,901.17కోట్ల వ్యయంతో ఈ మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించబడింది.
మార్కెటింగ్‌శాఖ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం ఇచ్చిన తర్వాత నిర్మాణ కార్యకలాపాలు మొదలవుతాయి.
1986లో కొత్తపేటలో 22ఎకరాల్లో పండ్ల మార్కెట్‌ను ప్రారంభించారు.తర్వాత రద్దీ సమస్యల కారణంగా 2021లో కొహెడకు తరలించారు.
అయితే,అక్కడ షెడ్లు వర్షాలు,గాలికి తాళలేక ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత బాటసింగారం హెచ్‌ఎండీఏ లాజిస్టిక్ పార్క్‌లో తాత్కాలికంగా మార్చారు.
ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో,అన్ని వసతులతో కూడిన పండ్ల మార్కెట్ నిర్మాణం అత్యవసరమని ప్రభుత్వం గుర్తించింది.ఇందుకు కొహెడస్థలం అనువైనదిగా భావించింది.
వివరాలు
దిల్లీని మించి ప్రయోజనాలు
ప్రస్తుతం దేశంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ దిల్లీలో 100 ఎకరాల్లో కొనసాగుతోంది.
అయితే దీన్ని మించి, 2047 సంవత్సరానికిగానూ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీపీఆర్ రూపొందించారు.
రైతులకు మెరుగైన ధరలు అందించేందుకు, వినియోగదారులకు నాణ్యమైన ఫలాలు, ఆహార పదార్థాలు అందుబాటులోకి తీసుకురావడానికి, వ్యాపార, ఎగుమతుల అవకాశాలను విస్తరించేందుకు లక్ష్యాలను నిర్దేశించారు.
వివరాలు
విభాగాల వారీగా భూవినియోగం
పండ్ల వ్యాపార మౌలిక సదుపాయాలు - 48.71 ఎకరాలు
ప్రధాన రహదారులు - 56.05 ఎకరాలు
టోల్‌గేట్‌లు, నాలాలు, గ్రామ రోడ్లు - 17.27 ఎకరాలు
పార్కింగ్ ప్రాంతం - 16.59 ఎకరాలు
పూలు, డ్రైఫ్రూట్స్, పాడి, చేపలు, పౌల్ట్రీ, మాంసం, ఫ్రోజెన్, ప్యాక్డ్ ఫుడ్స్ - 10.98 ఎకరాలు
కోల్డ్ స్టోరేజ్‌లు - 9.50 ఎకరాలు
ఇవన్నీ కాకుండా పండ్ల రిటైల్ జోన్,నిల్వ కేంద్రాలు,ప్రాథమిక శుద్ధి కేంద్రాలు,ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పరిపాలన భవనం,ప్రయోగశాలలు,విశ్రాంతి గదులు, అగ్నిమాపక కేంద్రం, పోలీస్ స్టేషన్, ఆరోగ్య కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం, విద్యుత్ సబ్‌స్టేషన్ వంటివి కూడా నిర్మించనున్నారు.
మిషన్ భగీరథ ద్వారా రోజుకు 3 లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తారు.
వివరాలు
టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ - ప్రత్యేక ఆకర్షణ
ఈ ప్రాజెక్టులో ప్రత్యేక ఆకర్షణగా వంద అడుగుల ఎత్తుతో 19,375 చ.అడుగుల విస్తీర్ణంలో 'టవర్ ఆఫ్ ఎక్సలెన్స్' నిర్మిస్తారు.
ఇందులో నాలుగు అంతస్తులు వ్యాపార సంస్థల కోసం కేటాయించబడతాయి.
ఆరు హై-స్పీడ్ ఎలివేటర్లు, హెలిప్యాడ్ వసతులు కలిగి ఉంటుంది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని వాణిజ్య, ఎగుమతి సంస్థలకు లీజుపై స్థలాలు కేటాయిస్తారు.
మొత్తం వ్యయం
ఈ ప్రాజెక్టు కోసం రూ.350 కోట్లు భూసేకరణకు, రూ.1,694.74 కోట్లు నిర్మాణ, ఐటీ సదుపాయాల అభివృద్ధికి వెచ్చించనున్నారు.
వివరాలు
తెలంగాణకు గర్వకారణం - మంత్రి తుమ్మల
"తెలంగాణకు ప్రతిష్టాత్మకంగా ఉండేలా ఈ పండ్ల మార్కెట్‌ను తీర్చిదిద్దుతున్నాం. ఇది రాష్ట్రానికే కాదు, దేశ, అంతర్జాతీయ స్థాయిలోనూ వ్యాపార, ఎగుమతులకు కేంద్రంగా మారుతుంది. ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు, పండ్ల ఉత్పత్తి వృద్ధికి దోహదపడుతుంది. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఇది మార్గం వేస్తుంది," అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.