యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)పై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్ కు ఇప్పటికే 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి. ఈ విషయాన్ని ఇప్పటికే లా కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా యూసీసీపై అభిప్రాయాలను తెలియజేసేందుకు ఇచ్చిన గడువును పెంచేది లేదని లా కమిషన్ స్పష్టం చేసింది. 75 లక్షల స్పందనలలో 2 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రధానమంత్రికి పంపినట్లు చెప్పింది. యూసీసీకి వచ్చిన స్పందనపై నిర్ణయాల గురించి జూలై 28వ తేదీ నుంచి విశ్లేషించనున్నారు. ముఖ్యంగా ఎంపిక చేసిన పార్టీలతో ముఖాముఖీ చర్యలను కూడా ప్యానల్ జరిపే అవకాశం ఉంది.
ఒకే ఇంట్లో రెండు చట్టాలుంటే పురోగతి ఎలా సాధ్యమన్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యూసీసీ అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఒకే ఇంట్లో రెండు చట్టాల ఉంటే పురోగతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో యూసీసీపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడాన్ని యూసీసీ అంటారు. గతంలోనూ కేంద్రంలోని ప్రభుత్వాలు ఉమ్మడి పౌరస్మృతిపై చర్చలు జరిపినా అది కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.