మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తరుపున గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. విపక్షాలు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో వివరించారు. మణిపూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడేందుకు 80 రోజుల సమయం తీసుకున్నారని, ఆయన మౌన ప్రతిజ్ఞను విరమింపజేసేందుకే ఆఖరి ప్రయత్నంగా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలు సభలో నినాదాలు చేశారు. ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఇది సంఖ్యా బలం సమస్య కాదని, ఇది మణిపూర్ సమస్య అన్నారు.
మణిపూర్‌కు భరోసా కల్పించాలి: గౌరవ్ గొగోయ్
మణిపూర్‌కు న్యాయం చేయాలని ప్రతిపక్షాల 'ఇండియా' డిమాండ్ చేస్తోందని గౌరవ్ గొగోయ్ స్పష్టం చేశారు. 'ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రతిచోటా న్యాయానికి ముప్పు వాటిల్లుతుంది' అన్న మార్టిన్ లూథర్ కింగ్ మాటలను ఈ సంద్రభంగా గౌరవ్ గొగోయ్ గుర్తు చేశారు. మణిపూర్‌లో జరుగుతున్న ఈ సంఘటనలు ఈశాన్యంలో ఏదో ఒక మూలన జరుగుతున్నాయని అనుకోవద్దన్నారు. అది దేశ ఉనికికి ప్రమాదకరం అన్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్న మణిపూర్ వెంట దేశం మొత్తం ఉందన్న భరోసాను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అలా జరగకపోవడం విచారకరమన్నారు.