Operation Chirutha Success: ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత పులి.. విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆరు రోజులుగా సాగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. విమానాశ్రయం రన్‌వేపై చిరుత ఉండటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అధికారులు చిరుతను పట్టుకున్నారు. ఆదివారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) సమీపంలో చిరుతపులి కనిపించడంతో ఆరు రోజులుగా అటవీశాఖాధికారులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. గొల్లపల్లి సమీపంలోని విమానాశ్రయం కంచెలోకి చిరుతపులి ప్రవేశించడాన్ని గుర్తించిన విమానాశ్రయ అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు చిరుత
చిరుతపులి సంచరిస్తున్న ప్రాంతాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన అధికారులు చిరుతను పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి బోనులను ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. అటవీ సిబ్బంది, పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ అధికారుల సహకారంతో గురువారం చిరుతపులిని పట్టుకోవడంతో శంషాబాద్ ప్రాంత వాసులకు ఊరట లభించింది. బోనులో చిక్కిన చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూ లో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.