Page Loader
Maharastra: 'పాచిపోయిన పప్పు' వివాదం.. హాస్టల్ క్యాంటీన్ లైసెన్స్ సస్పెన్షన్
'పాచిపోయిన పప్పు' వివాదం.. హాస్టల్ క్యాంటీన్ లైసెన్స్ సస్పెన్షన్

Maharastra: 'పాచిపోయిన పప్పు' వివాదం.. హాస్టల్ క్యాంటీన్ లైసెన్స్ సస్పెన్షన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని ఆకాశవాణి ప్రాంతంలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో పనిచేస్తున్న క్యాంటీన్‌ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తాత్కాలికంగా రద్దు చేసింది. శివసేన శాసనసభ్యుడు సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్‌ సిబ్బందిపై చేయిచేసుకున్న ఘటన తర్వాత ఈ చర్యలు చేపట్టారు. ఎఫ్‌డీఏ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,ఆ క్యాంటీన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ - 2006లోని కీలక నిబంధనలు,అలాగే 2011లో అమలులోకి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్‌ను ఉల్లంఘించినట్లు వెల్లడైంది. హాస్టల్‌లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు తప్పిదాలు బయటపడ్డాయి. పన్నీర్,చట్నీ,నూనె,కంది పప్పు వంటి ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు వారు తెలిపారు.

వివరాలు 

క్యాంటీన్‌ సిబ్బందిపై దౌర్జన్యం చేసిన శివసేన ఎమ్మెల్యే  గైక్వాడ్ 

పరీక్షా నివేదిక 14 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జూలై 10 నుండి హాస్టల్‌ పరిధిలో అన్ని ఆహార సేవల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. గైక్వాడ్ తన గదికి భోజనం ఆర్డర్ చేశాక,అందిన ఆహారంలో పప్పు నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. ఆపై ఆయన నేరుగా క్యాంటీన్‌కు వెళ్లి సిబ్బందిపై దౌర్జన్యం చేశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక, ఆ భోజనానికి బిల్లు చెల్లించేందుకు ఆయన నిరాకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాను చేసినదానికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఏ విధమైన పశ్చాత్తాపం కూడా లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆహార పదార్థాల నమూనాలను సేకరిస్తున్న ఎఫ్‌డీఏ అధికారులు