Page Loader
Suryapet: లింగమంతులస్వామి జాతర ప్రారంభం.. భక్తజన సందోహంతో హోరెత్తిన ప్రాంగణం
లింగమంతులస్వామి జాతర ప్రారంభం.. భక్తజన సందోహంతో హోరెత్తిన ప్రాంగణం

Suryapet: లింగమంతులస్వామి జాతర ప్రారంభం.. భక్తజన సందోహంతో హోరెత్తిన ప్రాంగణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓ లింగా.. ఓ లింగా.. అంటూ భక్తజనుల దైవనామస్మరణతో సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర ప్రాంగణం మారుమోగింది. ప్రతి రెండేళ్లకోసారి ఐదురోజులపాటు నిర్వహించే పెద్ద(గొల్ల)గట్టు జాతర ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. జాతర తొలి ఘట్టంగా దేవర(అందనపు చౌడమ్మ)పెట్టెకు సూర్యాపేట గ్రామీణ మండలం కేసారంలో యాదవ సంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, హక్కుదార్లు, పూజారులు మేళతాళాలతో, భేరీలు మోగిస్తూ భక్తిప్రపత్తితో ఊరేగింపుగా పెట్టెను పెద్దగట్టుకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు జాతర ప్రాంగణానికి చేరుకుని తమ మొక్కులు సమర్పించారు. సోమవారం ఉదయం నుంచి లింగమంతుల స్వామికి బోనాలు సమర్పించడం, ముద్దెరపోలు, జాగిలాలు పోయడం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Details

కోదాడలో ట్రాఫిక్‌ జామ్ 

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఆదివారం ప్రారంభమైన లింగమంతుల జాతర నేపథ్యంలో జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను కోదాడ నుంచి హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారికి చేరుకునేలా మార్గం మళ్లించారు. కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్ పైవంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ పెరిగింది, వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. అదే విధంగా, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద మళ్లిస్తున్నారు. మార్గం మార్పు కారణంగా వాహనదారులు అదనంగా 20 కి.మీ. ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.