
Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్ మధ్య లాజిస్టిక్ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ఒక కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్),ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్)మధ్యలో లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముందుంచింది.
ఈ దిశగా రోడ్లు,భవనాల శాఖకు తమ ప్రతిపాదనలను త్వరలో పంపించనుంది.మహానగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజారవాణా పటిష్టీకరణతోపాటు సరుకు రవాణా కూడా సజావుగా సాగేందుకు లాజిస్టిక్ హబ్‌లు అత్యవసరంగా మారాయి.
తాజా మాస్టర్‌ప్లాన్‌లోనూ ఈ హబ్‌లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఔటర్ రింగ్ రోడ్,ఆర్‌ఆర్‌ఆర్ మధ్య భాగాన్ని కలుపుతూ రేడియల్ రోడ్లు,గ్రిడ్ రోడ్ల నిర్మాణం జరగనుంది.
ఈరహదారుల మధ్యలో లాజిస్టిక్ హబ్‌లు ఏర్పాటు చేస్తే,భవిష్యత్తులో నగరానికి సరుకు రవాణా మరింత సమర్థవంతంగా సాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
ట్రక్కింగ్ కార్యకలాపాల కేంద్రాలుగా లాజిస్టిక్ హబ్‌లు
ఇప్పటికే ఔటర్ పరిధిలోని బాటసింగారం, మంగల్‌పల్లి ప్రాంతాల్లో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో లాజిస్టిక్ హబ్‌లు నిర్మించబడ్డాయి.
ఇవి విజయవంతంగా పని చేయడంతో హెచ్‌ఎండీఏ మరోసారి కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించింది.
రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, వీటికి మద్దతుగా మరిన్ని లాజిస్టిక్ హబ్‌లు అవసరమవుతున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్ పలు జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం కలిగి ఉండటంతో నగరానికి వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ భారం పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలో నగర శివార్లలో సరుకు నిక్షేపణ కేంద్రాలుగా, ట్రక్కింగ్ కార్యకలాపాల కేంద్రాలుగా లాజిస్టిక్ హబ్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి.
వివరాలు
ఒక్కో హబ్‌కు 100 ఎకరాలు కేటాయింపు
ప్రతీ లాజిస్టిక్ హబ్ సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.ఇవి అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా నిలవనున్నాయి.
ఇతర నగరాల నుంచి వచ్చే భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా శివార్లలో ఉన్న ఈ హబ్‌లలోనే లోడింగ్, అన్‌లోడింగ్ పూర్తి చేస్తాయి.
అక్కడి నుంచి చిన్న వాహనాల ద్వారా సరుకులు నగరంలోకి చేరవేయబడతాయి.
ప్రతి హబ్‌లో ట్రక్కింగ్ కార్యకలాపాలకు అనువుగా ప్యాకింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్, విశ్రాంతికేంద్రాలు, రెస్టారెంట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెట్రోల్ బంకులు, మరమ్మతుల కోసం గ్యారేజీలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ సదుపాయాలను వినియోగించుకునే సంస్థలు, ట్రాన్స్‌పోర్టర్లు నిబంధనల ప్రకారం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
దీని ద్వారా హెచ్‌ఎండీఏకు స్థిర ఆదాయ వనరులు సమకూరతాయి.