
Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇటీవల ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో ఏపీ ప్రభుత్వం జరిపిన సమావేశాల సందర్భంగా చంద్రబాబుకు లేఖ రాసిన బిల్ గేట్స్, పలు అంశాల్లో ఆయన చూపిన విజన్‌కు అభినందనలు తెలియజేశారు.
పేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల విద్యా, ఆరోగ్య రంగాల్లో పురోగతి సాధించేందుకు గేట్స్ ఫౌండేషన్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమని లేఖలో పేర్కొన్నారు.
కొన్ని నెలల క్రితం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ బృందం - గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం చర్చలు చేశారు.
Details
ఏఐ ఆధారిత డిసిషన్ మేకింగ్ పై దృష్టి
హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లినికల్ నిర్ణయాల వ్యవస్థ, మెడ్‌టెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, వ్యవసాయ రంగంలో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, మట్టి ఆరోగ్య మానిటరింగ్, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మైక్రోన్యూట్రియంట్ల వినియోగంపై చర్చలు జరిగిన విషయం గుర్తు చేశారు.
పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను సమర్ధంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చంద్రబాబు చూపిన చిత్తశుద్ధి, నాయకత్వ సామర్థ్యం ఆయన దూరదృష్టికి నిదర్శనమని గేట్స్ కొనియాడారు.
ఏఐ ఆధారిత డిసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా వ్యవస్థలు, మానవ వనరుల అభివృద్ధిపై సీఎం దృష్టి మరింత ప్రాముఖ్యత పొందిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Details
కలిసికట్టుగా ముందుకు సాగాలి
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల ప్రభావాన్ని పెంచేందుకు చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాకుండా, భారత్‌తో పాటు ఇతర తక్కువ ఆదాయ కలిగిన దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
తన తదుపరి భారత పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించే సమయానికి, నాయకత్వం, భాగస్వామ్య దృక్పథంతో గడించిన కాలంలో సానుకూలమైన పురోగతి కనపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత బలపడాలని, కలిసికట్టుగా ముందుకు సాగేందుకు తాను ఆశిస్తున్నట్టు బిల్ గేట్స్ తన లేఖలో స్పష్టం చేశారు.