Page Loader
Ahmedabad: అహ్మదాబాద్‌లో సాంకేతిక లోపం కారణంగా లండన్-బౌండ్ ఎయిర్ ఇండియా విమానం రద్దు 
అహ్మదాబాద్‌లో సాంకేతిక లోపం కారణంగా లండన్-బౌండ్ ఎయిర్ ఇండియా విమానం రద్దు

Ahmedabad: అహ్మదాబాద్‌లో సాంకేతిక లోపం కారణంగా లండన్-బౌండ్ ఎయిర్ ఇండియా విమానం రద్దు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాలో ఇటీవల వరుస ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనకు కారణమవుతున్నాయి. ఇటీవలే లండన్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషాద సంఘటన మరువకముందే, మరోసారి సంస్థకు చెందిన మరో విమానంలో సాంకేతిక లోపాలు వెలుగులోకి రావడం కలవరపెడుతోంది. తాజాగా అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన మరో విమానంలో టేకాఫ్‌కి ముందు సాంకేతిక సమస్యలు కనిపించడంతో, ఆ విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ఇండియా ఏఐ-159 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం తనిఖీలు జరుగుతున్న సమయంలో సాంకేతిక సమస్యలు వెలుగు చూసాయి.

వివరాలు 

కుప్పకూలిన ఏఐ-171 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం

వెంటనే టేకాఫ్‌ను నిలిపివేసి, ప్రయాణ సర్వీసును పూర్తిగా రద్దు చేశారు. ఇది గత వారంలో జరిగిన ప్రమాదం తర్వాత లండన్‌కు బయల్దేరాల్సిన తొలి షెడ్యూల్డ్‌ విమానం కావడం గమనార్హం. జూన్‌ 12న అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి లండన్‌కి బయలుదేరిన ఏఐ-171 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం కొద్దిసేపటికే కుప్పకూలి అగ్నికి ఆహుతైంది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 241 మంది ప్రయాణికులు మరణించగా,ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేగాక,ఆ విమానం ఒక నివాస సముదాయంపై పడటంతో అక్కడ నివసిస్తున్న 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తర్వాత ఎయిర్‌ఇండియా సంస్థ AI-171 అనే ఫ్లైట్‌ నంబర్‌ను తొలగించి, దాని స్థానంలో AI-159 అనే కొత్త నంబర్‌ను ప్రవేశపెట్టింది.

వివరాలు 

ఎయిర్‌ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు

కానీ ఇప్పుడు అదే కొత్త నంబర్‌ ఉన్న విమానంలో సాంకేతిక లోపం రావడం మరింత ఆందోళనకు దారి తీసింది. మరోవైపు, ఈ సంఘటన తర్వాత ఎయిర్‌ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. ఈ ఉదయం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబయికి వస్తున్న ఎయిర్‌ఇండియా AI-180 విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో, వెంటనే కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్‌ చేయించాల్సి వచ్చింది. ప్రయాణికులను విమానం నుంచి దిగనివ్వగా, అధికారులు పూర్తి తనిఖీలు చేపట్టారు.