Page Loader
AIR India: లండన్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం.. 3 గంటల పాటు గాల్లోనే..

AIR India: లండన్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం.. 3 గంటల పాటు గాల్లోనే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అనూహ్యంగా మధ్యలోనే తన ప్రయాణాన్ని విరమించి, కొన్ని గంటలకే తిరిగి ముంబయికి చేరింది. కానీ, ఈ మార్పుకు గల స్పష్టమైన కారణాలపై ఇంకా స్పష్టత లేదు. ఫ్లయిట్‌రాడార్24 (Flightradar24) డేటా ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున 5:39 గంటలకు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా ఏఐసీ129 (AIC129) ఫ్లైట్ లండన్‌ దిశగా బయలుదేరింది. అయితే దాదాపు మూడు గంటలపాటు గాల్లో ప్రయాణించిన ఈ విమానం, అనుకోని కారణాలతో తిరిగి ముంబయికే చేరుకోవాల్సి వచ్చింది.

వివరాలు 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు - గగనతల ఆంక్షలు 

ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా ఏ కారణం ప్రకటించలేదు. అయినప్పటికీ, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పశ్చిమాసియాను ఉద్రిక్త వాతావరణంలోకి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని కొన్ని దేశాలు తమ గగనతలంపై విమాన రాకపోకలపై ఆంక్షలు విధించాయి. దీనివల్ల అనేక అంతర్జాతీయ విమానాలు తమ దారిని మార్చుకోవాల్సి వచ్చింది. కొన్ని సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి.

వివరాలు 

ఎయిరిండియా విమానాలకు తీవ్ర ప్రభావం 

ఇరాన్‌ గగనతలంపై ఆంక్షల కారణంగా ఎయిరిండియా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకు మొత్తం 16 ఎయిరిండియా విమానాలు తమ మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని సంస్థ వెల్లడించింది. ప్రయాణికులు తాజా సమాచారం కోసం ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించింది. అంతేకాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ పేర్కొంది.

వివరాలు 

అహ్మదాబాద్‌-లండన్‌ విమాన ప్రమాదం - తీవ్ర విషాదం 

ఇక ఇదే సమయంలో, అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన మరో ఎయిరిండియా విమానం గురువారం ఘోర విమాన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విమానం టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే నివాస సముదాయంపై కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 241 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. విమానం పడిన ప్రాంతంలో ఉన్న వైద్య కళాశాల భవనాలపై పడటంతో అక్కడ ఉన్న మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక ప్రయాణికుడు మాత్రమే అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం గమనార్హం.