
Heavy Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల రెడ్ అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా పెరిగిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై విస్తరించింది. గత 24 గంటలుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఈ అల్పపీడనం మరింత బలపడటంతో తూర్పు తెలంగాణ ప్రాంతానికి సమీపంలో ఉన్న అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు.
Details
తీవ్ర వర్షాల హెచ్చరికతో రెడ్ అలర్ట్
తెలంగాణ వెదర్ మ్యాన్ తాజా అంచనాల ప్రకారం, నేటి నుంచి రానున్న మూడురోజుల వరకు తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి, సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.
Details
చల్లబడిన వాతావరణం
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నల్ల మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచే ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో రైతులూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉద్యోగస్తులు వర్షాల కారణంగా రవాణా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా, అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.