పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్
దిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వైరం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఆప్ నియమించిన ఇద్దరు ప్రభుత్వ నామినీలను ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) బోర్డుల నుంచి గవర్నర్ తొలగించారు. తొలగించబడ్డ ఇద్దరు సభ్యులు కూడా ఆప్‌లో కీలక నేతలు కావడం గమనార్హం. ఒకరు ఆప్ అధికార ప్రతినిధి జాస్మిన్ షా కాగా, మరొకరు ఎంపీ ఎన్‌డీ గుప్తా కుమారుడు నవీన్ ఎన్‌డీ గుప్తా. వీరిద్దరి నియామకం అక్రమమని, అలాగే వీరిపై అవినీతి ఆరోపణలు ఉండటంతో డిస్కమ్‌ల బోర్డుల నుంచి తొలగించినట్లు ఎన్డీటీవీ నివేదించింది.
లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: ఆప్
తొలగించిన వారి స్థానాల్లో పవర్ సెక్రటరీ, దిల్లీ ట్రాన్స్‌కో మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)లు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉంటారని ఎల్జీ ఉత్తర్వలు జారీ చేశారు. అయితే రాష్ట్రపతి నిర్ణయం మేరకే ఆప్ నామినీలను తొలగించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ఎల్జీ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. విద్యుత్‌పై ఇటువంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆప్ పేర్కొంది. సక్సేనా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆప్ నాయకులు మండిపడ్డారు.