రెండు కుక్కలు అరుచుకోవడంపై తీవ్ర వివాదం.. బ్యాంకు సెక్యూరిటీ కాల్పుల్లో ఇద్దరు మృతి
మధ్యప్రదేశ్‌లో ఈ మధ్యకాలంలో చాలా దారుణా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి . దీంతో ఏదో ఒక నేరానికి సంబంధించిన అంశంతో నిత్యం వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆ రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన జరిగింది. రెండు కుక్కల పరస్పరం అరుచుకున్న ఘటనలో యజమానులు గొడవ పడ్డారు. దీంతో ఓ కుక్క యజమాని హత్య జరగడం కలకలం సృష్టిస్తోంది. 35 ఏళ్ల విమల్ అచల్ రాత్రి 11 గంటలకు తన పెంపుడు కుక్కను తీసుకుని వాకింగ్‌కి బయల్దేరాడు. అదే సమయంలో రాజ్‌పాల్ రజావత్, పొరిగింటి వ్యక్తి అతని పెంపుడు కుక్కతో బయటకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురెదురు పడ్డ కుక్కలు పరస్పరం అరుచుకున్నాయి.
అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
దీంతో ఇద్దరు యజమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గమనించిన స్థానికులు ఇద్దరిని శాంతింపజేసేందుకు కృషి చేశారు. ఈ క్రమంలోనే వివాదం ముదరడంతో, కోపోద్రిక్తుడైన రజావత్ తన ఇంటికి వెళ్లి తుపాకీతో బయటకి వచ్చాడు. ఈ క్రమంలోనే తనతో గొడవ పడిన వ్యక్తిపై తొలి అంతస్తు నుంచి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇండోర్ నగరంలోని కృష్ణబాగ్ కాలనీలో ఉంటున్న నిందితుడు రాజ్‌పాల్ రజావత్ స్థానికంగా బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. వాగ్వాదంతో సర్వీస్ తుపాకీతో ఘాతుకానికి పాల్పడ్డట్లు ఇండోర్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.