Madhya Pradesh : నమ్మించి కారు ఎక్కించుకున్నారు.. కదులుతున్న వాహనంలో అత్యాచారం చేశారు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అబలపై మరో దాష్టీకం జరిగింది. దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో ఓ మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు.
దీంతో రాష్ట్రంలో మరోసారి కలకలం రేగింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అతివలు దారుణ అఘయిత్యాలకు గురవుతున్నారు.
వారి మీద మానభంగాలు, హత్యలు, హత్యాచారాలు, దాడులు జరగడం దేశవ్యాప్తంగా ప్రకంపణలు రేపుతున్నాయి.
తాజాగా దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి గురిచేశారు.
కార్యక్రమానికి వెళ్తున్న బాలికను చూసిన, అదే గ్రామానికి చెందిన నలుగురు నిందితులు తమ కారును ఆపారు. ఆపై ఆమెకు లిఫ్ట్ ఇస్తామన్నారు.
DETAILS
కేసు నమోదు చేయని పోలీసులపై చర్యలు : ఏఎస్పీ
అనంతరం బాలికను నమ్మబలికి, తమ వాహనాన్ని అటవీ ప్రాంతానికి తరలించారు.ఈ నేపథ్యంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలిక అరుపులు, కేకలు బయటకు రాకుండా కారు లోపలున్న మ్యూజిక్ ఎక్కువ సౌండ్' పెట్టారు. ఆ తర్వాత ఆ బాలిక జరిగిన దారుణాన్ని కుటుంబీకులకు చెప్పుకుంది.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అదే రోజు పోలీసులను ఆశ్రయించారు. కానీ అక్కడ ఫిర్యాదును స్వీకరించలేదు.
నవంబర్ 18న డిండోరి జిల్లా కేంద్రానికి వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా నిందితులపై కేసు నమోదు చేశారు.
అత్యాచార ఘటనపై పోక్సో,ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఏఎస్పీ మార్కం అన్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశామన్నారు.
కేసు నమోదు చేయని స్థానిక ఠాణా పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.