Page Loader
Maha Kumbh : మాఘ పౌర్ణమి పుణ్యస్నానం.. భక్తుల రద్దీతో 'నో వెహికల్‌ జోన్‌'
మాఘ పౌర్ణమి పుణ్యస్నానం.. భక్తుల రద్దీతో 'నో వెహికల్‌ జోన్‌'

Maha Kumbh : మాఘ పౌర్ణమి పుణ్యస్నానం.. భక్తుల రద్దీతో 'నో వెహికల్‌ జోన్‌'

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు గంగమ్మలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. మాఘ పౌర్ణమి వేళ త్రివేణీ సంగమానికి మూడు నుంచి నాలుగు కోట్ల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రోజంతా స్నానాలు కొనసాగుతాయని, దాదాపు 10 లక్షల మంది కల్పవాసులు దీక్ష విరమిస్తారని తెలిపారు. అంతేకాదు భక్తులకు అభినందనగా హెలికాప్టర్‌ ద్వారా పుష్ప వర్షం కురిపించారు.

Details

పవిత్ర స్నానాలకు భక్తుల పోటెత్తు.. భారీ ట్రాఫిక్ జామ్‌ 

కుంభమేళాలో ఐదో పవిత్ర స్నానాల సందర్భంలో భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ చుట్టుపక్కల 350 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రయాగ్‌రాజ్‌ను 'నో వెహికల్‌ జోన్‌'గా ప్రకటించారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తూ, మాఘ పౌర్ణమి స్నానాలు ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతంలో ఉన్న పార్కింగ్‌ లొట్స్‌ ఇప్పటికే వాహనాలతో నిండిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 31 రోజుల్లో ఇప్పటివరకు 46.25 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

Details

 నేడు ప్రయాగ్‌రాజ్‌లో 'నో వెహికిల్‌ జోన్‌' 

మాఘ పౌర్ణిమను పురస్కరించుకుని బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో భారీ స్థాయిలో భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఫిబ్రవరి 8 నుంచి మహాకుంభమేళాకు వెళ్లే మార్గాల్లో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మాఘ పౌర్ణిమ మంగళవారం సాయంత్రం 6.55 గంటలకు ప్రారంభమై, బుధవారం రాత్రి 7.22 గంటలకు ముగుస్తుంది. దీంతో మంగళవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి మేళా ప్రాంతాన్ని 'నో వెహికిల్‌ జోన్‌'గా ప్రకటించి, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.