LOADING...
Maharashtra: మహారాష్ట్ర పుర ఎన్నికల్లో మహాయుతి జోరు.. పోలింగ్‌కు ముందే 68 స్థానాలు 
మహారాష్ట్ర పుర ఎన్నికల్లో మహాయుతి జోరు.. పోలింగ్‌కు ముందే 68 స్థానాలు

Maharashtra: మహారాష్ట్ర పుర ఎన్నికల్లో మహాయుతి జోరు.. పోలింగ్‌కు ముందే 68 స్థానాలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా పోలింగ్ జరగకముందే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తన రాజకీయ బలాన్ని చాటుకుంది. ఈ ఎన్నికలకు జనవరి 15న ఓటింగ్ జరగాల్సి ఉండగా, ఇప్పటికే 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం వల్ల అనేక పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ లేకుండానే ఫలితాలు తేలాయి. ఈ 68 ఏకగ్రీవ విజయాల్లో బీజేపీ అత్యధికంగా 44 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. వీటిలో థానే జిల్లాలోని కల్యాణ్-డొంబివలి మున్సిపల్ కార్పొరేషన్‌ నుంచి అత్యధిక స్థానాలు లభించాయి.

Details

ఎన్‌సీపీకి రెండు స్థానాలు ఏకగ్రీవం

అంతేకాదు, పుణె, పింప్రి-చించ్వాడ్, పన్వేల్, భివండి, ధూలే, జల్గావ్, అహిల్యానగర్‌ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఏకనాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనకు 22 స్థానాలు పోటీ లేకుండానే దక్కగా, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)కి రెండు స్థానాలు ఏకగ్రీవంగా లభించాయి. పుణెలోని 35వ వార్డులో బీజేపీ అభ్యర్థులు మంజుషా నాగపురే, శ్రీకాంత్‌ జగ్తాప్‌లకు ప్రత్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో వీరిద్దరినీ ఏకగ్రీవంగా విజేతలుగా ప్రకటించారు. వీరిద్దరూ 2017 నుంచి 2022 వరకు అదే వార్డును ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

Details

దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఉన్న ప్రజాదరణే కారణం

ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు మురళీధర్‌ మోహోల్‌ స్పందిస్తూ, ఈ ఏకగ్రీవ విజయాలు బీజేపీ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతుకు స్పష్టమైన నిదర్శనమని వ్యాఖ్యానించారు. పుణె నగరానికి వచ్చే మేయర్‌ కూడా బీజేపీ నుంచే వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "మాకు మొత్తం 125 స్థానాల లక్ష్యం ఉంది. అందులో ఇప్పటికే రెండు స్థానాలు ఏకగ్రీవంగా దక్కాయి. ఇంకా 123 స్థానాలు మిగిలి ఉన్నాయి" అని పీటీఐ వార్తా సంస్థకు ఆయన తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయాలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఉన్న ప్రజాదరణతో పాటు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్‌ రూపొందించిన ఎన్నికల వ్యూహమే ప్రధాన కారణమని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.

Advertisement