LOADING...
AP FiberNet: ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!
ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!

AP FiberNet: ఏపీ ఫైబర్‌ నెట్‌లో భారీ మార్పులు.. ముగ్గురు ఉన్నతాధికారుల తొలగింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ఆ సంస్థ ఛైర్మన్‌ జీవీ రెడ్డి స్పష్టం చేశారు. ఫైబర్ నెట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పప్పూ భరద్వాజ, బిజినెస్ అండ్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ గంధంశెట్టి సురేశ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ శశాంక్‌ హైదర్‌ ఖాన్‌లను తొలగిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినా, ఎండీ, ఈడీ చర్యలు తీసుకోలేదని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఫలితంగా ఉద్యోగులకు జీతాల రూపంలో సంస్థ నిధులు వెచ్చించాల్సి వచ్చిందని విమర్శించారు.

Details

సంస్థలో పురోగతి కనిపించడం లేదు

జీఎస్టీ అధికారులు సంస్థపై రూ. 377 కోట్ల జరిమానా విధించినా ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని ఆరోపించారు. 8 నెలలుగా సంస్థలో పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేక పోయామని, కొత్త కనెక్షన్లు ఏవీ ఇవ్వలేకపోయామని తెలిపారు. తమ నిర్ణయాలకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఇక జీవీ రెడ్డి ఫైబర్ నెట్ ఎండీ దినేశ్‌కుమార్‌ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆగస్టులో ఎండీగా వచ్చినప్పటి నుంచి ఒక్కరోజూ సమీక్ష నిర్వహించలేదని. ఆయన కనీసం ఓ ఆపరేటర్‌ను కూడా కలవలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలానే ఆయన పని చేస్తున్నారని, ఆదాయం పెంచే చర్యలు తీసుకోవడం లేదు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Details

అక్రమ చెల్లింపులపై ఆరోపణలు 

సిబ్బందికి అక్రమంగా మూడు నెలల జీతాలు చెల్లించారని జీవీ రెడ్డి తెలిపారు. ఈ మొత్తం జీతాల చెల్లింపును ఎండీ దినేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారుల నుండి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్, సీఎస్‌కు లేఖ రాస్తానని తెలిపారు. 2019-24 మధ్య అక్రమాలపై విజిలెన్స్ విచారణకు అధికారులు సహకరించలేదని ఆయన ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్‌లో మార్పులు తప్పవని, సంస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకువస్తామని స్పష్టం చేశారు.