మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఎల్లుండి హస్తం గూటికి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్s ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వేడి పుట్టించారు. ఈ మేరకు అధికార పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ క్రమంలోనే 27న హస్తం కండువా కప్పుకునేందుకు రంగం సిద్దమైంది. దిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో మైనంపల్లితో పాటు కుమారుడు రోహిత్, ముగ్గురు కార్పోరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ ఇవాళ మైనంపల్లి ఇంటికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి మర్యాదపూర్వకంగా ఆహ్వానించనున్నారు. మైనంపల్లికి మల్కాజిగిరి, రోహిత్ కు మెదక్ టిక్కెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. దీంతో హస్తం గూటికి చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
స్థానిక ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు గులాబీ పార్టీకి బైబై
త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. దీంతో మెదక్ టిక్కెట్ తన కుమారుడికి దక్కలేదని, ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి తనతో పాటు తన కుమారుడు రోహిత్ కోసం టిక్కెట్ ఆశించాడు మైనంపల్లి. పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం మెదక్ సీటును, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే కేటాయించారు. దీంతో తిరుగుబాటు జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి తీవ్రంగా మాట్లాడారు. తన కుమారుడికి సీటు రాకుండా హరీశ్ అడ్డుకున్నాడంటూ భగ్గుమన్నారు. కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న మైనంపల్లి తాజాగా స్థానిక ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు గులాబీ పార్టీకి బైబై చెప్పేశారు.