Malladi Vishnu: వైసీపీకి మల్లాది విష్ణు రాజీనామా?.. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్యెల్యే మల్లాది విష్ణు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో 175కి 175 స్థానాలు లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తుచేస్తున్న సంగతి తెలిసిందే. జనాదరణ తగ్గిన.. వ్యతిరేకత పెరిగిన నాయకులను పక్కన పెట్టి పార్టీ గెలుపే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 11 మంది ఇంఛార్జ్‌లను మార్చిన జగన్.. తాజాగా మంగళవారం మరో 27 మంది ఇంఛార్జ్‌లను కూడా మార్చేశారు. అయితే టికెట్ దక్కదని భావించిన నేతలంతా ప్రస్తుతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం
ఇంఛార్జ్‌ల మార్పులో రెండో జాబితాలో విష్ణును జగన్ పక్కన పెట్టి విజయవాడ సెంట్రల్ టికెట్‌ను వెలంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించారు. ఈ విషయమై అలిగిన విష్ణు త్వరలో వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన విష్ణు..ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున విజయవాడ సెంట్రల్ నుంచి గెలుపొందారు. 2014లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో విష్ణు వైసీపీలో చేరి విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేసి టీడీపి అభ్యర్థి బొండా ఉమపై కేవలం 25 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించడంతో.. విష్ణు పార్టీ మారాలని నిర్ణయించారు.