'Rasgulla' exploded: రసగుల్లా అనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దీపావళి వేడుకల సమయంలో రసగుల్లా అనుకుని నోట్లో పెట్టుకున్న నాటుబాంబు పేలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పొరుగింటి వ్యక్తి స్వీటు అని నమ్మించి ఇచ్చిన నాటుబాంబును కొరకడంతో ఈ ప్రమాదం జరిగింది. అడవి పందులను వేటాడేందుకు ఉపయోగించే శక్తిమంతమైన నాటుబాంబును మిఠాయి రూపంలో ఇచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలు
రసగుల్లా అని నమ్మించి..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని డిండోరి జిల్లా పడరియా ఛాంతా గ్రామానికి చెందిన రాజేంద్ర బరౌటియా (35) రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి ఆవరణలో కుటుంబసభ్యులతో కలిసి చలిమంట దగ్గర కూర్చున్నాడు.
అదే సమయంలో ఆ ప్రాంతానికి చెందిన రామ్‌భగత్ బరౌటియా అక్కడికి వచ్చాడు.
రాజేంద్రతో కాసేపు సరదాగా మాట్లాడాడు.ఆ తర్వాత తన చేతిలో ఉన్న గుండ్రని వస్తువును చూపిస్తూ అది రసగుల్లా అని చెప్పి తినమని ఇచ్చాడు.
చుట్టూ చీకటిగా ఉండటంతో అది నిజంగానే స్వీటు అని రాజేంద్ర నమ్మాడు.వెంటనే దాన్ని నోట్లో వేసుకుని కొరికాడు.
అయితే దవడతో ఒత్తిడి తగలగానే అందులో ఉన్న నాటుబాంబు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో రాజేంద్ర నోరు,దవడ భాగాలు తీవ్రంగా ఛిద్రమయ్యాయి.
వివరాలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన రాజేంద్ర రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.
వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆటోరిక్షాలో డిండోరి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ రాజేంద్ర ప్రాణాలు విడిచాడు.
వివరాలు
నిందితుడి అరెస్ట్.. మైనర్‌ను విచారిస్తున్న పోలీసులు
ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
అనంతరం నిందితుడు రామ్‌భగత్ బరౌటియాను అరెస్ట్ చేశారు.
విచారణలో తనకు ఈ నాటుబాంబును ఓ బాలుడు ఇచ్చినట్లు నిందితుడు వెల్లడించాడు. దీంతో ఆ మైనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఈ హత్య వెనుక పాత కక్షలు ఉన్నాయా? లేక మరేదైనా కారణంతో ఈ దారుణానికి పాల్పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు ఉద్దేశపూర్వకంగానే రాజేంద్రను హత్య చేశాడా అనే విషయాన్ని తేల్చేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.