Assam: ట్రిపుల్ మర్డర్ కేసు: అత్త, మామ, భార్యను చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
అసోంలో దారుణం జరిగింది. గోలాఘాట్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. నజీబుర్ రెహమాన్ బోరా(25) అనే వ్యక్తి తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను హత్య చేశాడు. ఆ తర్వాత తొమ్మిది నెలల కొడుకును తీసుకొని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రిపుల్ మర్డర్‌పై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నజీబుర్ రెహమాన్ భార్య పేరు సంఘమిత్ర. వీరిది ప్రేమ వివాహం. మెకానికల్ ఇంజినీర్ అయిన నజీబుర్‌కు 2020లో లాక్‌డౌన్‌లో సోషల్ మీడియా ద్వారా సంఘమిత్రతో పరిచయం ఏర్పడింది. అది కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. అదే ఏడాది అక్టోబర్ ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
కొడుకు పుట్టాక నజీబుర్ - సంఘమిత్ర మధ్య గొడవలు
నజీబుర్-సంఘమిత్ర పెళ్లి అనంతరం ఇద్దరు కోల్‌కతాలో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. జనవరి 2022లో, సంఘమిత్ర-నజీబుర్ మళ్లీ చెన్నైకి పారిపోయారు. అక్కడ వారు 5నెలలు ఉన్నారు. ఈ దంపతులు ఆగస్టులో గోలాఘాట్‌కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతి. గతేడాది నవంబర్‌లో ఈ దంపతులకు కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చిలో సంఘమిత్ర తన కొడుకుతో కలిసి నజీబుర్ ఇంటిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. నజీబుర్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నజీబుర్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 28రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
హత్యపై దర్యాప్తు చేసేందుకు సీఐడీ బృందం నియామకం
జైలు నుంచి వచ్చిన తర్వాత నజీబుర్ తన బిడ్డను కలవాలనుకున్నాడు. కానీ సంఘమిత్ర కుటుంబం అతన్ని కలవడానికి అనుమతించలేదు. ఇదిలా ఉంటే, ఏప్రిల్ 29న సంఘమిత్ర, ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్‌పై దాడి చేశారని నజీబుర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన నజీబుర్ తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను హత్య చేశాడు. అనంతరం తన తొమ్మిది నెలల చిన్నారితో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుడిపై హత్య, ఇంటి చొరబాటు కేసు నమోదు చేసినట్లు అస్సాం పోలీస్ చీఫ్ జీపీ సింగ్ ట్వీట్ చేశారు. ఈ దారుణ హత్యపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర సీఐడీ బృందాన్ని నియమించారు.