Manda Krishna : బీజేపీకి బిగ్ బూస్ట్.. కమలాన్ని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులకు మందకృష్ణ మాదిగ లేఖ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల బీజేపీకి వెయ్యి ఏనుగుల బలం లభించింది. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. భాజపా పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలకు, నాయకులకు, కార్యకర్తలకు లేఖ రాశారు. మాదిగ కులస్థులను కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆవేదన వెలిబుచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో తమ సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్'ను మర్చిపోవద్దని లేఖలో పేర్కొన్నారు. భారతదేశాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్'ను దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, తమకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
చెప్పుకునేందుకు కూడా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదు : మందకృష్ణ
తమకి అనుకూలమైన కమిషన్ల నివేదికలను కాంగ్రెస్ సర్కార్లు విస్మరించాయన్నారు. వర్గీకరణ కోసం కాంగ్రెస్ ఏరోజు ముందడుగు వేయలేదన్నారు. కమిషన్ల నివేదికలు తమకు అనుకూలంగా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాలు, పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దతపై చొరవ తీసుకోలేదన్నారు. తెలంగాణలో గత దశాబ్దకాలంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, వర్గీకరణ అంశాన్ని ఏనాడు లేవనెత్తకపోవడం, వర్గీకరణకావాలని కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. మరోపక్క బీఆర్ఎస్ తమ సామాజికవర్గాన్ని మోసం చేశారన్న మందకృష్ణ, ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కనీసం చెప్పుకునేందుకు కూడా మాదిగలకు అవకాశం కల్పించలేదన్నారు.కేసీఆర్ మాదిగలను రాజకీయంగా అణచివేశారన్నారు. అందువల్ల వర్గీకరణకు సానుకూలం అని ప్రకటించిన బీజేపీకే తమ మద్దతని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.