మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ హింసపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నా, విపక్షాలు పారిపోతున్నాయని ఆరోపించారు. మణిపూర్ హింసపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు చర్చ అక్కర్లేదని, కేవలం నిరసన మాత్రమే కావాలని దుయ్యబట్టారు. సభలో రచ్చ సృష్టించి తమను మౌనంగా ఉంచాలని కాంగ్రెస్ చూస్తోందని, కానీ తమ నోరును మూయించలేరని షా ధీమా వ్యక్తం చేశారు. తమకు దేశ ప్రజల మద్దతు ఉందని చెప్పారు.
మణిపూర్ హింసను ఎవరూ అంగీకరించరు: అమిత్ షా
మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై తాను వివరంగా మాట్లాడతానని అమిత్ షా అన్నారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, అలాంటి ఘటనను ఎవరూ అంగీకరించరన్నారు. మణిపూర్‌లో జాతి ఘర్షణ ఘటన సిగ్గుచేటని విపక్ష నేతలు అంటున్నారని, కానీ ఆ హింసను రాజకీయం చేయడం అంతకన్నా సిగ్గుమాలి చర్యగా అమిషా అభివర్ణించారు. మణిపూర్ మోదీ పట్టించుకోవడం లేదనే ప్రతిపక్షాల వాదనను అమిత్ షా కొట్టిపారేశారు. మోదీ ఆదేశాల మేరకు తాను మూడు రోజులు మణిపూర్‌లో పర్యటించినట్లు చెప్పారు. మొత్తం 16 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, 36,000 మంది జవాన్లను పంపామన్నారు. చీఫ్ సెక్రటరీని మార్చామని, డీజీపీని కూడా మార్చినట్లు, సెక్యూరిటీ అడ్వైజర్‌లను కూడా పంపినట్లు పేర్కొన్నారు.
1993 నాటి అల్లర్లను ప్రస్తావించిన అమిత్ షా
మణిపూర్‌లో విపరీతమైన హింస చోటుచేసుకుందన్న ప్రతిపక్షాల వాదనతో నేను ఏకీభవిస్తున్నాని అమిత్ షా చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల కంటే, తామే ఎక్కువ బాధపడుతున్నట్లు షా అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇంతకంటే ఘోరమైన హంస చెలరేగినట్లు అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో 1993 నాటి అల్లర్లను అమిత్ షా ఉదహరించారు. 1993లో నాగా-కుకీ ఘర్షణల్లో 700 మంది మరణించారని అప్పుడు పార్లమెంట్‌లో ప్రకటన చేసింది ప్రధాని, హోంమంత్రి కాదని, హోంశాఖ సహాయ మంత్రి చేశారన్నారు. మణిపూర్ హింసపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నించడంపై అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.