Page Loader
మణిపూర్‌ హింసలో మరో ముగ్గురు మృతి; హైవే దిగ్బంధాన్ని ఎత్తివేసిన కుకీలు 
మణిపూర్‌ హింసలో మరో ముగ్గురు మృతి; హైవే దిగ్బంధాన్ని ఎత్తివేసిన కుకీలు

మణిపూర్‌ హింసలో మరో ముగ్గురు మృతి; హైవే దిగ్బంధాన్ని ఎత్తివేసిన కుకీలు 

వ్రాసిన వారు Stalin
Jul 03, 2023
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో అల్లర్లు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమంతబి గ్రామంలో మరోసారి హింస చెలరేగింది. బంకర్‌కు కాపలా ఉన్న ముగ్గురు గ్రామ వాలంటీర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగనట్లు అధికారులు చెప్పారు. అలాగే ఈ కాల్పుల్లో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే, కుకీ గ్రూపులైన యూపీఎఫ్, కేఎన్ఓ మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో జాతీయ రహదారి-2 దిగ్బంధనాన్ని ఎత్తివేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు కుకీ గ్రూపులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

మణిపూర్

రెండు నెలల నుంచి ఎన్‌హెచ్-2ను దిగ్బంధిస్తున్న కుకీలు

మణిపూర్‌లో ఎన్‌హెచ్-2 (ఇంఫాల్-దిమాపూర్), ఎన్‌హెచ్-37 (ఇంఫాల్-జిరిబామ్) రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. మే నెలలో మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుంచి ఎన్‌హెచ్-2ను కుకీ సంస్థలు దిగ్భందిస్తున్నాయి. షెడ్యూల్డ్ తెగ (ఎస్‌టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌ను నిరసిస్తూ మే 3న కొండ జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించారు. అప్పటి నుంచి మణిపూర్‌లో జాతి ఘర్షణలు మొదల్యయాయి. హింసాకాండ తరువాత, మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. చాలా రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మణిపూర్ జనాభాలో మైతీలు దాదాపు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులైన నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. వీరు ఎక్కువగా కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.