Manmohan Singh: 1991 సంస్కరణలు, కొత్త ఆర్థిక యుగం ఆర్కిటెక్ట్
రెండేళ్ల క్రితం శ్రీలంకలో లీటర్ పాల ధర రూ.1,100, గ్యాస్ ధర రూ.2,657కి చేరిందని వార్తలు వచ్చాయి. కోవిడ్ కారణంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఇటువంటి పరిస్థితి భారత్‌కూ వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ,30 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు,ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాయి. 1991 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వం పీవీ నరసింహారావును ప్రధానిగా,మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించింది. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. విదేశీ దిగుమతుల కోసం భారత దగ్గర ఉన్న మారకద్రవ్యం కేవలం ఒక బిలియన్ డాలర్లకే పరిమితమైంది.
పరపతి పెంపు
ఈ నగదు రెండు వారాలకు మించి సరిపోదు. ఈ పరిస్థితిలో రావ్ - సింగ్‌ల జోడీ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి బరిలో దిగింది. వంద రోజుల వ్యవధిలోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మన్మోహన్‌సింగ్ రూపాయి మారకం విలువను జూలై 1న 9.5 శాతం తగ్గించారు, తర్వాత రెండు రోజులకే మరో 12 శాతం తగ్గించారు. దీని వల్ల ఎన్నారైల పెట్టుబడులు తిరిగి దేశంలోకి వచ్చాయి, విదేశీ మారకద్రవ్యం లోటు తాత్కాలికంగా తగ్గింది. పరువు కాపాడటానికి వ్యూహం మారకద్రవ్య కొరతను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు తాకట్టు పెట్టి 600 మిలియన్ డాలర్లు అప్పుగా తెచ్చారు.
లైసెన్స్ రాజ్ అంతం
1991 జూలై 25న మన్మోహన్‌సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లైసెన్స్ రాజ్‌ను నిర్వీర్యం చేయడంతో పాటు, దిగుమతులపై పన్నులు తగ్గించారు. ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించి ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం అందించారు.ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు, దీని ద్వారా బ్లాక్‌మనీపై అదుపు సాధించారు. ప్రైవేటు రంగానికి ఉత్సాహం ప్రైవేటు బ్యాంకులకు అనుమతి ఇచ్చి, కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు 51శాతం వరకు అవకాశం కల్పించారు.దీనివల్ల ప్రైవేటు రంగం పుంజుకుంది,యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించాయి. ఆర్థిక పునరుత్థానం 1990లో డబుల్ డిజిట్‌లో ఉన్న కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ 1992 నాటికి 10కి దిగువకు వచ్చింది.ఆర్థిక సంస్కరణల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగి,ఈ రోజు భారత దేశ ఆర్థిక ప్రగతి అందరికి కనిపించే స్థాయికి చేరుకుంది.