Loading...
Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. చంద్రబాబు పాలనపై ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం!
ఏపీకి భారీగా పెట్టుబడులు.. చంద్రబాబు పాలనపై ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం!

Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. చంద్రబాబు పాలనపై ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదుగుతోందని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు భారీ సంఖ్యలో ప్రాజెక్టులను ఆకర్షిస్తూ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. గతేడాది నిర్వహించిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల్లో 76 శాతాన్ని అమల్లోకి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించిన విజయమని కొనియాడారు. కేవలం మాటలు, ప్రణాళికలకే పరిమితం కాకుండా వాటిని ఆచరణాత్మక విజయాలుగా మార్చడమే సీఐఐ భాగస్వామ్య సదస్సు అసలైన గొప్పతనమని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ 31వ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుకల్లో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

వివరాలు

ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలకు ముఖద్వారంగా ఏపీ

సుదీర్ఘ తీర ప్రాంతం, మూడు జాతీయ పారిశ్రామిక కారిడార్లు, వ్యూహాత్మక భౌగోళిక స్థానంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన ముఖద్వారంగా ఎదుగుతోందని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.

ప్రపంచ ఆర్థిక చర్చలకు కీలక కేంద్రంగా విశాఖపట్నం మారుతున్న తీరును గత రెండు రోజులుగా చూస్తున్నామని చెప్పారు.

విధాన రూపకర్తలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని తెలిపారు.

2025 నవంబరు 14న ఇదే విశాఖపట్నంలో నిర్వహించిన 30వ సదస్సులోనూ తాను పాల్గొన్నట్లు గుర్తుచేశారు. ఏడాది కిందటే చంద్రబాబు ఈ సదస్సుకు తమను ఆహ్వానించారని చెప్పారు.

ఇది ఆయన డైనమిక్‌ నాయకత్వానికి, ఒప్పందాలను ఆచరణలోకి తీసుకొచ్చే నైపుణ్యానికి, సంకల్పానికి, సానుకూల దృక్పథానికి, పట్టుదలకు నిదర్శనమని ప్రశంసించారు.

వివరాలు

పారిశ్రామిక, ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు చాలా మందికి ఆ నిర్ణయం నచ్చలేదని సీపీ రాధాకృష్ణన్‌ అన్నారు. అయితే ఒక్కోసారి చెడులోనూ మంచే జరుగుతుందని వ్యాఖ్యానించారు.

విభజిత రాష్ట్రంలో విజయనగరం నుంచి తిరుపతి వరకు, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన 'వికసిత్‌ భారత్‌-2047' లక్ష్యాలకు అనుగుణంగా 'స్వర్ణాంధ్ర-2047' విజన్‌ రూపొందిందని తెలిపారు.

గ్రీన్‌ ఎనర్జీ, కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ టెక్నాలజీ, పోర్టులు, ఏరోస్పేస్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక, ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు

ఉప రాష్ట్రపతి కార్యాలయానికి ఏఐ అసిస్టెంట్‌ ఇవ్వండి

రాబోయే దశాబ్దాల్లో సాంకేతికత నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని ఉప రాష్ట్రపతి అన్నారు. డిజిటల్‌ విప్లవం మరింత వేగవంతం కానుందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికీ ఒక ఏఐ అసిస్టెంట్‌ను అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా తమ ఉప రాష్ట్రపతి కార్యాలయానికి కూడా ఒక ఏఐ అసిస్టెంట్‌ను ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు.

ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోటెక్నాలజీ రంగాలు దశాబ్దం క్రితం ఊహించనన్ని అవకాశాలను సృష్టిస్తున్నాయని తెలిపారు.

ప్రధాని ఆకాంక్షలకు అనుగుణంగా తయారీ, ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా భారత్‌ ఎదుగుతోందని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు

సవాళ్ల నుంచే విజయగాథలు మొదలవుతాయి

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో ప్రస్తుత సీఐఐ సదస్సును 'నావిగేటింగ్‌ ది న్యూ వరల్డ్‌ ఆర్డర్‌, టెక్నాలజీ అండ్‌ ట్రస్ట్‌' అనే థీమ్‌తో నిర్వహించడం సందర్భోచితమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

పరిస్థితులు కఠినంగా మారినప్పుడే మనలోని ప్రతిభ, ఉత్సాహం, సామర్థ్యం, సాధించాలనే పట్టుదల బయటపడతాయని అన్నారు. అప్పుడే విజయగాథలు ప్రారంభమవుతాయని వివరించారు.

అంతర్జాతీయ పరిస్థితులు, పారిశ్రామిక ప్రగతికి అంతగా అనుకూలంగా లేనప్పటికీ విదేశీ ప్రతినిధుల ముఖాల్లో కనిపించిన ఉత్సాహం ప్రపంచాన్ని తదుపరి దశకు తీసుకెళ్తుందనే నమ్మకాన్ని కలిగించిందని తెలిపారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం, విశ్వసనీయ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ద్వారా భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే స్థితిలో ఉన్నాయని సీపీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT